గోల్డెన్ న్యూస్.. తులం బంగారం రూ.55వేలు!

పెళ్లిళ్లు, శుభకార్యాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది బంగారమే. అంతగా మన సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడిపోయింది బంగారం. అంతేకాదు.. పెట్టుబడి పెట్టాలనుకునేవారికి పసిడి మంచి సాధనం. పసిడితోపాటు వెండికి కూడా మంచి గిరాకీ ఉంది. అందుకే నిత్యం బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని అంటుతుంటాయి. నిన్నటి వరకు అందుకోండి చూద్దాం అంటూ మిడిసి పడిన బంగారం.. ఇప్పుడు నేలపైకి దిగొస్తోంది. కొన్ని రోజుల్లో లక్ష దాటుతుందనుకున్న బంగారం కొన్ని రోజుల్లో మరింత తగ్గే అవకాశం కనిపిస్తోంది. 


ఇంటర్నేషనల్ మార్కెట్లో 4-5 రోజుల కిందట స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 3168 డాలర్ల వద్ద ఉంది. ఇక్కడ ఔన్సు అంటే 31.10 గ్రాములు. అక్కడి నుంచి వరుసగా రెండు రోజులు 60 డాలర్ల వరకు పడిపోగా.. మళ్లీ 2 రోజులు స్థిరంగా ఉంది. ఇప్పుడు 3030 డాలర్ల స్థాయి నుంచి ఒక్కరోజులోనే 30 డాలర్లకుపైగా పడిపోయి 3 వేల డాలర్ల దిగువకు చేరింది. సిల్వర్ రేటు కూడా భారీగా దిగొస్తోంది. 


దేశీయంగా చూస్తే హైదరాబాద్ నగరంలో ఇవాళ 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 250 తగ్గింది. దీంతో ప్రస్తుతం తులం గోల్డ్ రేటు రూ. 82,850 కి పడిపోయింది. దీనికి ముందు ఏప్రిల్ 4, 5 తేదీల్లో చూస్తే వరుసగా రూ. 1600, రూ. 900 చొప్పున పడిపోయింది. ఇక 24 క్యారెట్ల పుత్తడి ధర చూస్తే ప్రస్తుతం రూ. 280 పడిపోగా 10 గ్రాములు రూ. 90,370 కి దిగొచ్చింది. ఇదే ఢిల్లీలో చూసినట్లయితే 22 క్యారెట్స్, 24 క్యారెట్ల బంగారం ధర వరుసగా తులానికి రూ. 83 వేలు, రూ. 90,530 పలుకుతోంది.


హైదరాబాద్ నగరంలో చూస్తే కిలో వెండి రేటు రూ. 1.03 లక్షల వద్ద కొనసాగుతోంది. ఇదే సమయంలో ఢిల్లీలో సిల్వర్ రేటు కేజీకి రూ. 94 వేల మార్కు వద్ద ఉంది.


ఇది ఎందుకు జరిగిందంటే, కొన్ని పెద్ద కారణాలు ఉన్నాయి. వీటిలో ట్రంప్ చేస్తున్న టారిఫ్ హడావిడి కూడా ఒకటి. బంగారం విషయంలో  ట్రంప్ విధానాలు ఎలా పనిచేశాయంటే.. సుంకాలు వేస్తానని చెప్పినప్పుడు, మొదట జనం భయపడి బంగారం కొనడం మొదలెట్టారు, ధరలు పైకి వెళ్లాయి. 


ట్రంప్ అధికారంలోకి వచ్చాక.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలి పోయాయి. పెట్టుబడిదారుల భయాందోళనతో ఒక్కసారిగా స్టాక్‌ మార్కెట్‌ క్రాష్‌ అయ్యింది. అయితే సహజంగా స్టాక్‌ మార్కెట్లు నస్టాన్ని చవి చూసినప్పుడు బంగారం ధరలు పెరగాలి. కానీ ప్రస్తుతం పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి. కేవలం స్టాక్‌ మార్కెట్లు మాత్రమే కాకుండా పెట్టుబడి దారులు బంగారం నుంచి సైతం తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడం వల్ల పసిడి ధరలు తగ్గుముఖం పడుతున్నట్లు తెలుస్తుంది. 


మరోవైపు బంగారం ధర భారీగా పెరగడంతో మైనింగ్ కంపెనీలు పెద్ద ఎత్తున మైనింగ్ చేశాయి. దీంతో మార్కెట్లో అవసరానికి మించిన బంగారం లభిస్తోంది. ఈ కారణంగానే బంగారం ధరలు తగ్గడానికి పరోక్షంగా సహరించిదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ డిసెంబర్‌ నాటికల్లా 120 పాయింట్ల మీద వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అలాగే మే నెలలో వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి దీంతో బంగారం ధర మరింత తగ్గే అవకాశం కనిపిస్తోంది.



ఇన్వెస్టర్లు బంగారం కన్నా కూడా స్విట్జర్లాండ్ ఫ్రాంక్, జపనీస్ యెన్ వంటి కరెన్సీల పైన పెట్టుబడి పెడుతున్నారు. ఇది కూడా బంగారం ధరలు తగ్గడానికి ఒక కారణం.


ఇదిలా ఉంటే బంగారం ధరల పతనం మరింత కొనసాగి తులం బంగారం ధర రూ. 55 వేలకు దిగివచ్చే అవకాశం ఉందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  ఇలాగే తగ్గముఖం పడితే.. జనాలు మళ్లీ బంగారం కొనుగోలుపై మొగ్గు చూపుతారు. అయితే, ట్రంప్ వల్ల ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందనేది నిపుణులు కూడా అంచనా వేయలేకపోతున్నారు. 


మొత్తానికి పసిడి ప్రియులకు బంగారం తగ్గడం మంచి శుభవార్త అని చెప్పవచ్చు. మొన్నటి వరకు లక్షల్లో ఉన్న బంగారం కనీవినీ ఎరగని రీతిలో ధరలు పడిపోతున్నాయి. అందుకే బంగారం కొనేవారు ఇప్పుడే కొనేస్తే మంచిది. రానున్న రోజుల్లో బంగారం రేటు తగ్గుతుందని చెబుతున్నప్పటికీ స్టాక్ మార్కెట్ కుప్పకూలడంతో మళ్లీ బంగారంపై పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. దీని వల్ల రేట్లు పెగవచ్చు కూడా.. కాబట్టి బంగారం తగ్గినప్పుడే కొనేడం బెటర్. 


మరి బంగారం రేటు ఇంకా తగ్గుతుందా? లేదా పెరుగుతుందా? అనేదానిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.


Comments