భారత్, పాక్ మధ్య యుద్ధం జరిగితే? ఏఏ దేశాలు ఎవరికి సపోర్ట్ చేస్తాయి? యుద్ధం వల్ల ఎవరికి నష్టం?
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం సమీపంలోని బైసరన్ వ్యాలీలో ఉగ్రదాడి తర్వాత భారత్ వెంటనే కఠిన చర్యలకు దిగింది. 1960 నుంచి అమలులో ఉన్న సింధూ జల ఒప్పందాన్ని నిలిపివేసింది, దీనివల్ల పాకిస్థాన్‌లో నీటి సరఫరా, వ్యవసాయం తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. అటారీ-వాఘా సరిహద్దు చెక్‌పోస్ట్ మూసివేయబడింది, దీనితో రెండు దేశాల మధ్య వాణిజ్యం, ప్రయాణాలు స్తంభించాయి. పాకిస్థాన్ పౌరులకు జారీ చేసిన వీసాలు రద్దు చేయబడ్డాయి. అలాగే 48 గంటల్లో భారత్‌ను విడిచి వెళ్లాలని ఆదేశించింది. పాకిస్థాన్ హైకమిషన్‌లో సిబ్బందిని 55 నుంచి 30కి తగ్గించారు. సైనిక సలహాదారులను ఉపసంహరించారు. ఈ చర్యలు పాకిస్థాన్‌పై ఆర్థిక, దౌత్య ఒత్తిడిని పెంచాయి.
మరోవైపు పాకిస్థాన్ ఈ చర్యలకు ప్రతిస్పందనగా తీవ్ర వైఖరి అవలంబించింది. భారత విమానాలకు తమ గగనతలంలో ప్రవేశాన్ని నిషేధించింది, దీనివల్ల భారత విమానయాన రంగంపై ప్రభావం పడనుంది. భారత్‌తో వాణిజ్య సంబంధాలను పూర్తిగా నిలిపివేసింది. భారత పౌరులకు జారీ చేసిన వీసాలను రద్దు చేసింది. 1972 సిమ్లా ఒప్పందంతో సహా ద్వైపాక్షిక ఒప్పందాలను నిలిపివేసినట్లు ప్రకటించింది. సింధూ జల ఒప్పందం నిలిపివేతను "యుద్ధ చర్య"గా అభివర్ణించి, పూర్తి శక్తితో స్పందిస్తామని హెచ్చరించింది. ఉత్తర సరిహద్దుల్లో సైనిక వనరులను, యుద్ధ విమానాలను మోహరించినట్లు సమాచారం.
ఈ ఉద్రిక్తతలు యుద్ధ వాతావరణాన్ని పెంచాయి. రెండు దేశాలూ అణ్వాయుధ శక్తులు కావడంతో, ఒక చిన్న ఘర్షణ కూడా యుద్ధానికి దారితీయవచ్చు. 2019లో పుల్వామా దాడి తర్వాత భారత్ బాలాకోట్‌లో ఎయిర్‌స్ట్రైక్‌లు చేసిన సంఘటన ఇలాంటి పరిస్థితులను గుర్తుచేస్తుంది. సింధూ జల ఒప్పందం నిలిపివేత వంటి చర్యలు పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభాన్ని తీవ్రతరం చేయవచ్చు, ఇది సైనిక చర్యలకు దారితీయొచ్చు.
ఒకవేళ భారత్, పాక్ మధ్య యుద్ధం జరిగితే.. కొన్ని దేశాలు నేరుగా లేదా పరోక్షంగా పాల్గొనే అవకాశం ఉంది. అమెరికా, భారత్‌తో బలమైన రక్షణ, ఆర్థిక సంబంధాల కారణంగా మనకే మద్దతిస్తుంది. రష్యా, చారిత్రక సంబంధాలు, ఆయుధ సరఫరాల వల్ల భారత్ వైపు నిలుస్తుంది. ఫ్రాన్స్, యూకే, ఆస్ట్రేలియా, జర్మనీ, యూఏఈ వంటి దేశాలు ఉగ్రవాద వ్యతిరేకత, ఆర్థిక సంబంధాల కారణంగా భారత్‌కు మొగ్గు చూపవచ్చు. ఇప్పటికే ఈ దేశాలు పహల్గాం దాడిని ఖండించి, భారత్‌కు సానుభూతి తెలిపాయి.
ఇక పాకిస్థాన్‌కు చైనా ప్రధాన మిత్రదేశంగా నిలుస్తుంది. చైనా-పాకిస్థాన్ ఆర్థిక కారిడార్, రక్షణ సంబంధాలు, భారత్‌తో సరిహద్దు వివాదాలు దీనికి కారణం. టర్కీ, ఇరాన్ వంటి దేశాలు ఇస్లామిక్ సంబంధాలు, భారత్‌తో రాజకీయ విభేదాల కారణంగా పాకిస్థాన్‌కు మద్దతివ్వవచ్చు. సౌదీ అరేబియా, భారత్‌తో బలమైన వాణిజ్య సంబంధాల కారణంగా తటస్థంగా ఉండవచ్చు. ఐక్యరాష్ట్ర సమితి, యూరోపియన్ యూనియన్ వంటి సంస్థలు శాంతి చర్చలకు పిలుపునివ్వొచ్చు.
యుద్ధం జరిగితే నష్టం రెండు దేశాలకూ తప్పదు. భారత్‌లో యుద్ధ వ్యయం ఆర్థిక వృద్ధిని దెబ్బతీస్తుంది. సైనిక, పౌర మరణాలు, గాయాలు సంభవిస్తాయి. కాశ్మీర్‌లో పర్యాటక రంగం, ఇప్పటికే దెబ్బతిన్నాయి. యుద్ధం జరిగితే కాశ్మీర్‌లో పర్యాటకం మరింత క్షీణిస్తుంది. అలాగే పాకిస్థాన్‌లో సింధూ జల ఒప్పందం నిలిపివేత వల్ల పాకిస్తాన్ వ్యవసాయాన్ని, ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తుంది. సైనిక శక్తిలో భారత్‌తో పోలిస్తే పాకిస్తాన్ వెనుకబడి ఉండటం వల్ల పాకిస్తాన్‌కే ఎక్కువ నష్టం జరగవచ్చు. ఒకవేళ అణ్వాయుధ యుద్ధం జరిగితే, దక్షిణాసియా మొత్తం విధ్వంసానికి గురవుతుంది.
ప్రస్తుతం భారత్, పాక్ మధ్య ఉన్న ఈ సంక్షోభం శాంతియుతంగా పరిష్కరించబడుతుందా? లేక యుద్ధ విపత్తుకు దారితీస్తుందా? అనేది సమయమే నిర్ణయిస్తుంది.

Comments
Post a Comment