వీధుల్లో తిరిగే ఆమెకు వేలాది మంది భక్తులు..
ఆమె ఒక మతి స్థిమితం లేని మహిళ. ఎప్పుడూ మాసిన దుస్తులతో కనిపిస్తుంది. అసలు ప్రపంచంతో సంబంధం లేదన్నట్లు తన పని తాను చేసుకుంటూ పోతుంది. అయితే ఆమెను అక్కడి వారు దైవ సమానులుగా భావిస్తుంటారు. ప్రజలు ఆమె నీడ పడడమే మహా భాగ్యమని అనుకుంటారు. అరుణాచలేశ్వరుడి సన్నిధిలో నిత్యం గిరి ప్రదక్షిణ చేసే ఆమె అసలు పేరేంటో తెలియదు కానీ, భక్తులు మాత్రం ఆమెను టోపీ అమ్మ అని పిలుచుకుంటారు. ఇంతకీ ఎవరీ టోపీ అమ్మ.? అసలు ఆవిడ కథ ఏంటో తెలియాలంటే ఈ వీడియో చూసేయండి.
తమిళనాడులోని తిరువణ్ణాలమై పర్వతాల్లో కొలువై ఉన్న అరుణాచలం గురించి అందరికి తెలుసు. గిరి ప్రదక్షిణలకు ఈ గుడి పెట్టింది పేరు. ఇక్కడే ఉంటుంది ఆ టోపీ అమ్మ. అరుణాచలంలో వీధుల్లో నివసిస్తూ, ఒంటిపై మాసిన దుస్తులు ధరిస్తూ నిత్యం గిరి ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. ఇప్పటివరకూ ఆమె 11 వేల సార్లు గిరి ప్రదక్షిణ చేసిందని చెబుతారు. అందుకే ఆమె అనుగ్రహం కోసం భక్తులు పోటీపడతుంటారు.
ఆమె కారణ జన్మురాలని, అవధూతగా భావిస్తూ అక్కడికి వెళ్లిన భక్తులు ఆమెను పూజిస్తారు. అలాగే ఆమె తాగి పడేసిన టీ కప్పును మహా ప్రసాదంగా భావిస్తుంటారు. కానీ, ఆమె ఎవరితో మాట్లాడదు. ఆమెకు భక్తులు కానీ, స్థానికులు ఎవరైనా ఎంత అమూల్యమైన వస్తువును ఇచ్చినా.. దాన్ని విసిరి పారేస్తుంది. అయితే, ఈమెను కొందరు అవధూత అని అంటుంటే.. మరికొందరు ఆమె ఒక సాధారణ మనిషని, మతిస్థిమితం లేని వ్యక్తి అని చెప్పే వాళ్లు కూడా ఉన్నారు.
అయితే, ఆవిడ గురించి తెలుసుకుంటే.. కొన్ని విస్తుపోయే నిజాలు భయటపడ్డాయి. టోపీ అమ్మగా చెప్పబడే ఆమె అసలు పేరు పళనీ అమ్మ. ఆవిడది కన్యాకుమారి ప్రాంతం. అసలు ఈవిడ కన్యాకుమారి నుంచి అరుణాచలానికి ఎలా వచ్చింది? ఎప్పుడు వచ్చింది అనే విషయాల గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇవిడ చిన్న వయస్సు నుంచి ఇక్కడే ఉందని, ఒంటరిగానే జీవితం కొనసాగిస్తుందని ఒక కథ ప్రచారంలో ఉంటే.. ఆమెకు పెళ్లై పిల్లలు ఉన్నారని, ఆమె తమ్ముడు చనిపోయిన తరువాత నుంచి ఆమె మతిస్థిమితం కోల్పోయి, అరుణాచలంకు వచ్చి, ప్రతి రోజూ గిరిప్రదక్షిణలు చేస్తూ ఇక్కడే ఉండిపోయిందని అంటుంటారు.
నిజంగానే ఆమె మొదటి నుంచే ఇక్కడే ఉందా..? లేదా పెళ్లై పిల్లలు పుట్టిన తరువాత, అనుకోని సంఘటనల కారణంగా ఇక్కడికి వచ్చిందా..? అనే విషయం మాత్రం ఎవరికీ స్పష్టంగా తెలియదు. కానీ, ఆవిడ అరుణాచలం రావడం, ప్రతీ రోజూ గిరి ప్రదక్షిణలు చేయడం అనేది నిజం. టోపీ అమ్మ దాదాపుగా ఆరు గంటల నుంచి ఏడు గంటల సమయంలో గిరిప్రదక్షిణ మొదలు పెట్టి, మధ్యాహ్నానికి పూర్తి చేస్తుందని, ఆ తరువాతే ఆమె భోజనం చేస్తుంది.
ఆమెకు ఆకలివేసినప్పుడు అక్కడ చుట్టుపక్కల ఉన్న హోటల్‌కి వెళ్తుంది. ఆమెను చూడడమే అదృష్టంగా భావించే వారు, ఆవిడ రాగానే ఇష్టమైన ఆహారాన్ని ఆమెకు అందిస్తారు. అందులో కూడా ఆమెకు కావల్సినంత మాత్రమే తిని, మిగిలినది అక్కడే పడేస్తుంది. అయితే, చాలామంది అరుణాచలానికి వచ్చిన భక్తులు ఆమెకు తినడానికి ఆహారం లేదా జ్యూస్‌లు ఇవ్వానికి ప్రయత్నిస్తుంటారు. ఆవిడ మాత్రం చిరాకు పడిపోతూ ఉంటుంది. వాళ్లని కొట్టినా.. తిట్టినా సరే.. ఆవిడ చేయి తాకిందని అనుకుంటూ సంతోషంగా భావిస్తారు. కానీ, భక్తులు ఎక్కువ అవ్వడంతో టోపీ అమ్మ మాత్రం చాలా ఇబ్బంది పడేదని అక్కడి స్థానికులు చెబుతున్నారు.
ఇక, టోపీ అమ్మ ఎందుకు ఇంత ఫేమస్ అయ్యిందంటే..దీనికి ఒక సంఘటన కారణమని చెబుతుంటారు. కొన్నేళ్ల క్రితం అరుణాచలం వచ్చిన మణిమారన్ అనే వ్యక్తి కిడ్నీ సమస్యతో బాధపడుతుండగా.. టోపీ అమ్మ అనుగ్రహం పొందగానే ఆ సమస్య తగ్గిపోయింద అతను తెలిపాడు. అప్పటి నుండి ఈ మణిమారన్ టోపీ అమ్మకి సన్నితుడిగా మారాడు. దీంతో టోపీ అమ్మను అందరూ దైవంగా భావించడం మొదలు పెట్టారు.
ఇలా రకరకాలుగా అనేక కథలు, పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. దీంతో, పెద్ద ఎత్తున భక్తులు కూడా ఆమె చూపు వారిపై పడాలని, కాళ్లపై పడుతూ, ఆమె వెంట నడుస్తూ ఆమెను ఇబ్బంది పెడుతున్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. దీంతో, అక్కడి కొందరు స్థానికులు ఆమెకు రక్షణగా ఉంటున్నారు. మతి స్థిమితం లేని, ఎప్పుడూ మాసిన దుస్తులతో ఉన్న ఈమెను చూస్తే, ఎంతో మంది భక్తులు చేతులెత్తి మొక్కుతుంటారు.
అసలు ఆవిడ పిచ్చిదైనా, దైవధూత అయినా, సాధారణ వ్యక్తే అయినా ఆమెను ఇబ్బంది పెట్టడం మాత్రం అనాగరిక చర్య అనే చెప్పాలి. అసలు ఈ టోపీ అమ్మ నిజంగానే అవధూత లేదా సాధారణ మనిషా..? దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
.jpg)

Comments
Post a Comment