సామాన్యులను భయపెడుతున్న పసిడి! తులం బంగారం రూ.రెండు లక్షలు?

ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశాన్నంటుతోంది. మొన్నటి వరకు రూ. 90 వేల స్థాయిలో ఉన్న తులం బంగారం ఇప్పుడు ఏకంగా లక్ష రూపాయల మార్క్‌ను తాకింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు దాదాపు 26% పెరిగిన బంగారం ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుకున్నాయి. ప్రస్తుతం భౌతిక మార్కెట్‌లో 24 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 96,590గా ఉంది. దీనికి 3 శాతం జీఎస్టీ కలిపితే దాదాపు రూ. 99,488 అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బంగారం ధరలు పెరుగుతుండటంతో దేశీయంగానూ అదే పరిస్థితి నెలకొంది. లైవ్ మార్కెట్లో ఇవాళ ఒక దశలో తులం గోల్డ్ రేటు రూ. లక్షను తాకింది. బంగారం ధరను గత 70 ఏళ్లలో ఏంత మేరా పెరిగిందో చూస్తే.. ఆశ్చర్యమేస్తోంది.


1955లో 10 గ్రాముల బంగారం ధర కేవలం రూ.79 మాత్రమే! అంటే ఆ రోజుల్లో ఒక్క వేతనంతో బంగారం కొనడం చాలా సాధ్యమే. 1960కి అది రూ.111కి పెరిగింది. కానీ అసలైన షాక్ మొదలైంది 1980లో – అప్పటికి ఇది నేరుగా రూ.1,330కి ఎగబాకింది. ఆ తరం మనసుల్లో "ఇంకా బంగారం కొనడం కష్టమే" అనే భావన మొదలై ఉంటుంది.


1990లలో భారతదేశం ఆర్థికంగా లిబరలైజేషన్ దిశగా అడుగులు వేసింది. అదే సమయంలో బంగారం ధర రూ.3,200కి చేరింది. 2000కి రూ.4,400, 2005కి రూ.7,000. ఇక 2010లో నేరుగా రూ.18,500! అప్పట్లో చాలామందికి ఇది భవిష్యత్తు పెట్టుబడిగా మారిపోయింది.


2015కి ధర రూ.26,343. ఆ తర్వాత 2020లో కరోనా సమయంలో ధర నెమ్మదిగా కానీ గట్టిగా పెరిగింది – రూ.48,651కి చేరింది. అందరూ భయంతో బంగారం కొనుగోళ్లకి మొగ్గుచూపారు.


2022, 2023లో వరుసగా రూ.56,100, రూ.61,100గా బంగారం ధర చకచకా పెరిగింది. 2024లో అయితే ఏకంగా రూ.74,100కి చేరింది.


ఇక 2025లో ఒక్క తులం బంగారం ధర లక్ష రూపాయల మార్కు దాటేస్తోంది.


ఇది కేవలం ఒక ఖరీదు చరిత్ర కాదు... ఇది ఒక సామాజిక చరిత్ర. అందరూ కల్లునిరై చూసే పసిడి ఇప్పుడు నిజంగా పసిడి లాంటి పెట్టుబడిగా మారిపోయింది. ఒకప్పుడు పెళ్లిళ్లలో తప్పనిసరిగా కొనే వస్తువు, ఇప్పుడు కొనాలంటే ఆలోచించాల్సిన వస్తువైంది.



కేవలం ఈ ఐదేళ్లలో.. ముఖ్యంగా ఈ ఏడాదిలో బంగారం ధర ఆకాశాన్ని అంటడానికి కొన్ని కారణాలు ఉన్నాయి.


* చైనా సెంట్రల్ బ్యాంక్ గత కొన్ని నెలలుగా డాలర్లకు బదులుగా బంగారం నిల్వలను పెంచుతోంది. ఇది బంగారం డిమాండ్‌ను పెంచుతోంది.


* అమెరికా, చైనాపై మరిన్ని టారిఫ్‌లు విధించడం వల్ల ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి పెరుగింది. దీంతో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి కోసం బంగారం వైపు మొగ్గు చూపారు.


* అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించడం వల్ల డాలర్ విలువ తగ్గింది. దీనివల్ల బంగారం ధరలు మరింత పెరుగుతోంది.


* ఇజ్రాయెల్-ఇరాన్, ఉక్రెయిన్-రష్యా వంటి ప్రపంచ రాజకీయ పరిస్థితులు బంగారం ధరలకు సానుకూలంగా మారుతున్నాయి.


* స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి నెలకొనడం వల్ల చాలామంది పెట్టుబడిదారులు సురక్షితమైన ఆప్షన్‌గా బంగారంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు.


* పలు దేశాల కేంద్ర బ్యాంకులు తమ నిల్వలను పెంచడానికి బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి.


* భారతదేశంలో పండుగలు పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం డిమాండ్ పెరగడం కూడా ధరల పెరుగుదలకు దోహదపడింది.


ఈ కారణాలు ఈ ఐదేళ్లలో ముఖ్యంగా 2025లో బంగారం ధరను రూ.లక్ష మార్క్‌ను దాటేలా చేశాయి. ఇది ఇలానే కొనసాగితే భవిష్యత్తులో బంగారం ధర మరింత ఎగబాకే ప్రమాదం లేకపోలేదు. 


గత 20 ఏళ్ల ట్రెండ్ బేస్ చేసుకుంటే, బంగారం ధర సగటున 40% నుంచి 80% వరకు ఐదు సంవత్సరాలలో పెరిగినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. అంటే ఇదే లాజిక్ కొనసాగితే, 2026కి బంగారం ధర రూ.1.12 లక్షల నుంచి రూ.1.18 లక్షల మధ్య ఉండొచ్చు. 2028కి అది రూ.1.45 లక్షలు నుంచి రూ.1.60 లక్షలు ఉండే అవకాశం ఉంది. అదే 2030కి రాగానే, మనం చూసే బంగారం ధర రూ.1.80 లక్షల నుంచి రెండు లక్షల దాకా వెళ్లొచ్చు. భవిష్యత్తులో బంగారం ఇంకా ఎన్ని ఎత్తులు చేరుతుందో చెప్పడం కష్టం.


ప్రస్తుతం కేవలం బంగారమే కాదు వెండి ధర కూడా చుక్కలు చూపిస్తోంది. ప్రస్తుతం కిలో వెండి కూడా రూ.99 వేలకు పైగా ధర పలుకుతోంది. అంటే ఇదికూడా రేపో మాపో లక్ష రూపాయల మార్కును దాటవచ్చు. ఇలా బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ రికార్డు ధరకు చేరుకుని సామాన్యులకు దూరంగా వెళుతున్నాయి. డబ్బులు బడాబాబులు తప్ప సామాన్యులు బంగారంవైపు కన్నెత్తిచూసే పరిస్థితులు లేవు. 


మరి బంగారం భవిష్యత్తులో ఎంత రేటు వెళ్తుందనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Comments

Popular posts from this blog