అంధురాలని చెత్తకుప్పలో పాడేశారు.. ఇప్పుడు MPSCలో జాబ్ కొట్టింది
ఇరవై ఐదు సంవత్సరాల క్రితం, మహారాష్ట్రలోని జల్గావ్ రైల్వే స్టేషన్ సమీపంలో చెత్తకుప్పలో ఒక చిన్న పాప కనిపించింది. ఆ బిడ్డకు పేరు లేదు, తల్లిదండ్రులు లేరు. ఆ అమ్మాయి అంధురాలు. ఎవరూ ఆ బిడ్డకు భవిష్యత్తు ఉంటుందని ఊహించలేదు. కానీ ఆ అమ్మాయి, తన జీవితంలో అసాధ్యమైనవి సాధ్యం చేసి చూపించింది. మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఉత్తీర్ణురాలై, నాగపూర్ కలెక్టరేట్‌లో రెవెన్యూ అసిస్టెంట్‌గా ఉద్యోగం సంపాదించింది. ఇది కేవలం ఒక ఉద్యోగం సాధించిన అమ్మాయి కథ కాదు. ఇది ఆత్మవిశ్వాసం, పట్టుదల, అవిశ్రాంత కృషికి సంబంధించిన సజీవ సాక్ష్యం.
ఆ అమ్మాయి పేరే మాలా పాపల్కర్. ఆ పాప పుట్టుకతోనే అంధురాలు కావడంతో కన్న తల్లిదండ్రులే ఆ చిన్నారిని వద్దనుకుని చెత్తకుప్పలో పడేశారు. స్థానికుల సమాచారంతో అక్కడికి వెళ్లిన పోలీసులు ఆ చిన్నారి తల్లిదండ్రుల కోసం ఎంతగానో ప్రయత్నించారు. కానీ, వారికి ఆచూకీ దొరకలేదు. దీంతో, పోలీసులు ఆ చిన్నారిని జల్గావ్లోని రిమాండ్ హోమ్‌లో చేర్పించారు. అంధత్వం ఆమెకు ఒక సవాలుగా ఉన్నప్పటికీ.. ఆమె దానిని తన బలహీనతగా చూడలేదు. అమరావతిలోని ఒక అనాథాశ్రమంలో పెరిగిన మాలా, చిన్నప్పటి నుంచి చదువుకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది. ఆమె చదువుకు అంకితం కావడం వెనుక ఒక స్పష్టమైన లక్ష్యం ఉంది. తనలాంటి వారికి ఒక స్ఫూర్తిగా నిలవాలని, సమాజంలో గౌరవప్రదమైన స్థానం సంపాదించాలని. బ్రెయిలీ లిపి ద్వారా చదువుకున్న మాలా, తన స్కూల్‌లో ఎప్పుడూ ఉత్తమ విద్యార్థిగా నిలిచేది. ఆమె ఉన్నత చదువుల కోసం నాగపూర్‌లోని ఒక కళాశాలలో చేరింది, అక్కడ ఆమె బీఏ పూర్తి చేసింది.
చదువు సాగుతున్న సమయంలోనే మాలాకు MPSC పరీక్ష గురించి తెలిసింది. ఈ పరీక్ష ద్వారా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే కల ఆమె మనసులో మొదలైంది. కానీ, ఈ పరీక్ష సామాన్యులకే సవాలుగా ఉంటుంది, అంధత్వంతో ఉన్న మాలాకు ఇది ఎంతో కష్టమైన పని. అయినా, ఆమె వెనుకడుగు వేయలేదు. ఆమెకు పరీక్ష రాయడానికి సహాయం చేసే వ్యక్తి అవసరమైంది. అలాగే, చదువుకు సంబంధించిన మెటీరియల్‌ను ఆడియో ఫార్మాట్‌లో సేకరించడం, బ్రెయిలీ పుస్తకాలను ఉపయోగించడం వంటివి ఆమె చేసింది. JAWS వంటి స్క్రీన్ రీడర్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి, ఆమె ఇంటర్నెట్ ఆధారంగా సమాచారం సేకరించింది. స్నేహితులు, ఉపాధ్యాయులు కూడా ఆమెకు కొన్ని పుస్తకాలను ఆడియో రూపంలోకి మార్చి ఇచ్చారు.
ఇలా రోజూ గంటల తరబడి చదివేది మాలా. ఆమె సమయాన్ని చాలా క్రమబద్ధంగా వినియోగించుకునేది. MPSC పరీక్షకు సంబంధించిన సిలబస్‌ను ఆమె లోతుగా అధ్యయనం చేసింది. History, Politics, Geography
అన్ని విషయాలను ఆమె ఆడియో లేదా బ్రెయిలీ ద్వారా నేర్చుకుంది. ఆమెకు పరీక్ష రాయడంలో స్క్రైబ్ సహాయం అవసరం కావడంతో, ఆమె ఒక వ్యక్తిని ఎంచుకుంది. ఎందుకంటే స్క్రైబ్‌తో సమన్వయం లేకపోతే పరీక్షలో విజయం సాధించడం కష్టం. దీనిపై కోర్టులు కూడా అంధ విద్యార్థులకు తమ ఇష్టమైన స్క్రైబ్‌ను ఎంచుకునే హక్కు ఉందని తీర్పు ఇచ్చింది. ఇది మాలాకు సహాయకరంగా ఉంది.
అనేక సవాళ్లను ఎదుర్కొన్న మాలా, MPSC పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. ఆమె కష్టం ఫలించింది. నాగపూర్ కలెక్టరేట్‌లో రెవెన్యూ అసిస్టెంట్‌గా ఉద్యోగం పొందింది. ఈ విజయం ఆమె జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. ఆమె కథ సమాజంలోని అనేక మందికి స్ఫూర్తినిచ్చింది. మాలా కథ కేవలం ఒక పరీక్షలో గెలవడం గురించి కాదు, ఇది సమాజం ఆమెను విడిచిపెట్టినా.. ఆమె తనను తాను విడిచిపెట్టకపోవడం గురించి.
ఈ రోజు మాలా పాపల్కర్ ప్రతీ ఒక్కరికీ ఒక రోల్ మోడల్. ఆమె అంధత్వం తన లక్ష్యాలకు అడ్డంకిగా లేదని నిరూపించింది. ఆమె కథ మనకు ఒకటే చెబుతుంది. జీవితంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా, వాటిని ధైర్యంగా ఎదుర్కొని, ఆత్మవిశ్వాసంతో ఏ లక్ష్యమైనా సాధించవచ్చు
Comments
Post a Comment