భారత్, పాకిస్తాన్‌కి ఎన్ని యుద్ధాలు జరిగాయి..? యుద్ధంలో పైచేయి ఎవరిది..?


పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి భారత్, పాకిస్తాన్ మధ్య ఉన్న శత్రుత్వాన్ని మరోసారి ఉధృతం చేసింది. ఈ దాడి కేవలం ఒక ఉగ్రవాద చర్యగానే మిగిలిపోలేదు. అది కాశ్మీర్ వివాదంలోని లోతైన గాయాలను మరోసారి తెరపైకి తెచ్చింది. ఇది రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలపై, భవిష్యత్ శాంతి అవకాశాలపై లోతైన ప్రభావం చూపింది. అయితే, ఈ సంఘటన నుంచి బయటపడాలంటే, రెండు దేశాలూ ద్వైపాక్షిక చర్చలు, అంతర్జాతీయ మధ్యవర్తిత్వం ద్వారా కాశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నించాలి. కానీ చరిత్ర చూస్తే, ఈ మార్గం అంత సులభం కాదని తెలుస్తోంది.  

1947లో బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు, సరిహద్దు వివాదాలు, మతపరమైన విభేదాలు యుద్ధాల రూపంలో బయటపడ్డాయి. ఈ యుద్ధాలు కేవలం రెండు సైన్యాల మధ్య జరిగినవి కాదు. అవి రెండు దేశాల ప్రజల జీవితాలను, వారి భవిష్యత్తును లోతుగా ప్రభావితం చేశాయి. 


ఈ క్రమంలోనే.. ఇరు దేశాల మధ్య మొదటి యుద్ధం 1947-48లో జరిగింది. దీన్ని మొదటి కాశ్మీర్ యుద్ధంగా పరిగణించారు. భారత్, పాకిస్తాన్ స్వాతంత్ర్యం పొందిన కొద్ది నెలల్లోనే ఈ యుద్ధం మొదలైంది. కాశ్మీర్ రాష్ట్రం అప్పట్లో దేశంలో అతి పెద్ద సమస్యగా మారింది. కాశ్మీర్ రాజు హరిసింగ్ భారత్‌లో విలీనం కావాలని నిర్ణయించుకున్నాడు. కానీ,  పాకిస్తాన్ అందుకు ఒప్పుకోలేదు. పాకిస్తాన్‌ సైనికులు కాశ్మీర్‌పై దాడి చేయగా.. భారత సైన్యం వారితో యుద్ధం చేసింది. 


ఈ యుద్ధంలో రెండు వైపులా వేలాది మంది సైనికులు, సామాన్య ప్రజలు చనిపోయారు. చివరికి 1949లో ఐక్యరాష్ట్ర సమితి మధ్యవర్తిత్వంతో,  ఒక సీజ్‌ఫైర్ ఒప్పందం కుదిరింది. ఈ యుద్ధం తర్వాత కాశ్మీర్ రెండు భాగాలుగా విడిపోయింది. ఒక భాగం భారత్ వద్ద, మరొక భాగం పాకిస్తాన్ వద్ద. ఈ విభజన లైన్ ఆఫ్ కంట్రోల్ (LOC)గా మారింది. ఇది ఇప్పటికీ రెండు దేశాల మధ్య వివాదాస్పదంగా మారింది. 


అప్పుడు వచ్చింది 1965 యుద్ధం. దీన్ని రెండో భారత్-పాకిస్తాన్ యుద్ధం అని కూడా అంటారు. ఈ యుద్ధం కూడా కాశ్మీర్ చుట్టూనే తిరిగింది. పాకిస్తాన్ భారత్‌లోకి చొరబడి, కాశ్మీర్‌లో తిరుగుబాటును రెచ్చగొట్టాలని ఆపరేషన్ జిబ్రాల్టర్ అనే పేరుతో ఒక ప్లాన్ వేసింది. కానీ,  ఈ ప్లాన్ విఫలమైంది. భారత సైన్యం గట్టిగా స్పందించి, పాకిస్తాన్ సైన్యం ప్లాన్‌ని తిప్పి కొట్టింది. 


ఈ యుద్ధంలో రెండు వైపులా చాలా నష్టం జరిగింది. చివరికి సోవియట్ యూనియన్ మధ్యవర్తిత్వంతో 1966లో తాష్కెంట్ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై భారత ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి, పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం రెండు దేశాలూ తమ సైన్యాలను యుద్ధానికి ముందు ఉన్న సరిహద్దులకు వెనక్కి తీసుకున్నాయి. కానీ ఈ యుద్ధం తర్వాత కూడా కాశ్మీర్ సమస్య పరిష్కారం కాలేదు.


ఇక, 1971లో జరిగిన యుద్ధం ఒక విశేషమైన యుద్ధం. ఇది కేవలం కాశ్మీర్ గురించి మాత్రమే కాదు, ఇది ఒక దేశం పుట్టుకకు దారితీసిన యుద్ధం. అప్పటి తూర్పు పాకిస్తాన్ ఇప్పుడు బంగ్లాదేశ్‌లోని బెంగాలీ ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి వివక్ష, అణచివేతను ఎదుర్కొంటున్నారు. వారు స్వాతంత్ర్యం కోసం తిరుగుబాటు చేశారు. పాకిస్తాన్ సైన్యం ఈ తిరుగుబాటును క్రూరంగా అణచివేసింది. ఈ క్రమంలోనే.. లక్షలాది మంది శరణార్థులు భారత్‌లోకి వచ్చారు. 


భారత్ ఈ సమస్యలో జోక్యం చేసుకుంది. డిసెంబర్ 1971లో ఈ యుద్ధం మొదలైంది. ఈ యుద్ధంలో భారత సైన్యం అద్భుతంగా పోరాడి, విజయం సాధించింది. కేవలం 13 రోజుల్లోనే పాకిస్తాన్ సైన్యం లొంగిపోయింది. ఈ యుద్ధం ఫలితంగా తూర్పు పాకిస్తాన్ స్వతంత్ర దేశంగా బంగ్లాదేశ్‌గా ఆవిర్భవించింది. ఈ యుద్ధంలో భారత్‌కు భారీ విజయం దక్కింది, కానీ రెండు వైపులా చాలా మంది సైనికులు, సామాన్య ప్రజలు చనిపోయారు.


ఇక, చివరిగా.. 1999లో కార్గిల్ యుద్ధం. ఇది ఒక పూర్తి స్థాయి యుద్ధం కాకపోయినా, రెండు దేశాల మధ్య జరిగిన ఒక పెద్ద సంఘర్షణగా చెప్పవచ్చు. పాకిస్తాన్ సైన్యం, ఉగ్రవాదుల సాయంతో కాశ్మీర్‌లోని కార్గిల్ ప్రాంతంలోని భారత భూభాగంలోకి చొరబడింది. ఈ చొరబాటును గుర్తించిన భారత సైన్యం ఆపరేషన్ విజయ్ పేరుతో ఒక భారీ సైనిక చర్య చేపట్టింది. ఈ యుద్ధం ఎత్తైన పర్వతాల్లో, కఠినమైన వాతావరణంలో జరిగింది. భారత సైనికులు అసాధారణ ధైర్యంతో పోరాడి, చొరబాటుదారులను వెనక్కి నెట్టారు. ఈ యుద్ధంలో భారత్ విజయం సాధించింది,  ఆక్రమిత ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకుంది. కానీ చాలా మంది సైనికులు తమ ప్రాణాలను కోల్పోయారు. 


అంతేకాకుండా.. ఈ యుద్ధం భారత్,  పాకిస్తాన్ మధ్య సంబంధాలను మరింత దిగజార్చింది. కాశ్మీర్ సమస్యను మరింత క్లిష్టతరం చేసింది. 


ఈ నాలుగు యుద్ధాలు.. 1947-48, 1965, 1971, 1999 భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలను, రాజకీయాలను, సరిహద్దు వివాదాలను లోతుగా ప్రభావితం చేశాయి. ప్రతి యుద్ధం తర్వాత,  రెండు దేశాలూ శాంతి కోసం ప్రయత్నించినా.. కాశ్మీర్ సమస్య ఇప్పటికీ పరిష్కారం కాకుండా ఉంది. ఇక, పహల్గామ్ లోయలో ఆ రోజు ప్రవహించిన రక్తం, శాంతి కోసం మరింత బలమైన ప్రయత్నాలు అవసరమని గుర్తుచేస్తుంది.


కానీ రెండు దేశాల మధ్య చారిత్రక శత్రుత్వం, కాశ్మీర్ వివాదం సంక్లిష్టత, ఈ ప్రయత్నాలను సవాలుగా మార్చాయి. విశ్లేషకులు ఈ దాడిని 2019 పుల్వామా దాడితో పోల్చారు, అప్పుడు భారత్ పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో గాలి దాడులు చేసింది. ఈసారి కూడా భారత్ సైనిక చర్యలకు దిగుతుందేమోనన అభిప్రాయాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక, భారత్‌తో పాకిస్తాన్‌ యుద్ధం చేస్తుందా? లేదా శాంతి ఒప్పందాలకు చర్చలకు దారితీస్తుందో  వేచి చూడాల్సిందే.


Comments

Popular posts from this blog