ఒకప్పుడు టీవీలో అరిచి గోల చేసిన Naaptol ఇప్పుడేమైంది? ప్రజలను ఎలా మోసం చేసింది!

‘నాప్టోల్’ ఈ పేరు తెలియని వారు దాదాపుగా ఎవరూ ఉండరు. ఇప్పుడంటే ఇంట్లో కూర్చొని ఒక క్లిక్‌తో షాపింగ్ చేయడం సర్వసాధారణం. కానీ, ఆన్‌లైన్ షాపింగ్ పెద్దగా అందుబాటులో లేని రోజుల్లో టీవీలో నాప్టోల్ చేసిన అడ్వటైజ్ హడావుడి అంతా ఇంతా కాదు. జస్ట్ టీవీ ఆన్‌ చేస్తే చాలు.. ఆఫర్ ఆఫర్ అంటూ అరిచి గోల చేసేవాళ్లు. తక్కువ స్టాక్ ఉంది. డిస్కౌంట్ ఆఫర్ కొద్ది సమయం మాత్రమే.. త్వరపడండి త్వరపడండి అంటూ హంగామా చేసేవాళ్లు. ఇలా నాప్టోల్ యాంకర్ అరిచి గోల చేయని ఇళ్లు ఉండదేమో.  ఇంటర్నెట్, ఆన్‌లైన్ షాపింగ్  అంతగా లేని రోజుల్లో అరిచి గోల చేసి మరీ సామాన్యులతో వస్తువులను కొనిపించిన నాప్టోల్ ఇప్పుడు కనీసం కనిపించును కూడా కనిపించడం లేదు. దీనికి కారణం.. నాప్టోల్‌లో జరిగిన మోసం, ఫిర్యాదులు, కోర్టు కేసులు ఒక కారణమని చెప్పొచ్చు. 


అసలు ఈ నాప్టోల్ ఎలా పుట్టింది. ప్రతి ఇంట్లో ఈ యాడ్ వచ్చేలా చేసిన స్ట్రేటజీ ఏంటి? ఎలా పాపులర్ అయింది? ప్రజలను ఎలా మోసం చేసింది? కోర్టుకు ఎందుకు వెళ్లింది? చివరకు ఏమైందని ఈ వీడియోలో తెలుసుకుందాం.


నాప్టోల్ కథ 2008లో మొదలైంది. ముంబైకి చెందిన మను అగర్వాల్ అనే యువ ఎంటర్‌ప్రెన్యూర్, ఇండియాలో ఒక భిన్నమైన ఆలోచనతో నాప్టోల్‌ను స్థాపించాడు. అప్పట్లో ఇండియాలో ఇ-కామర్స్ అంటే ఫ్లిప్‌కార్ట్ లాంటి కొన్ని స్టార్టప్‌లు మాత్రమే, అంతేకాకుండా ఇంటర్నెట్ వాడకం పట్టణాలకే పరిమితం. దీంతో నాప్టోల్ లక్ష్యం.. మధ్యతరగతి ప్రజలకు సరసమైన ధరల్లో రకరకాల ఉత్పత్తులను అందించడం. నాప్టోల్ మొదట ఒక ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్‌గా పనిచేసింది. అంటే వేరే సెల్లర్ల ఉత్పత్తులను తమ వెబ్‌సైట్‌లో చూపించి, కస్టమర్లకు కనెక్ట్ చేసేది. ఆ తర్వాత నాప్టోల్‌ అన్ని టీవీలలో తమ యాడ్స్‌ను ప్రాసారం చేసేందుకు.. డిష్ టీవీ ఆపరేటర్లకు డబ్బులు ఇచ్చి టీవీ ఆన్ చేయగానే ఈ యాడ్ వచ్చేలా చేశారు.


నిజానికి నాప్టోల్ ఇండియాలో పాపులర్ కావడానికి దాని తెలివైన మార్కెటింగ్, ఫ్రెండ్లీ ధరలే ప్రధాన కారణాలు. 2008-2010 మధ్యకాలంలో, భారత్‌లో ఇంటర్నెట్ యాక్సెస్ పెరుగుతున్నప్పటికీ, చాలా మంది ఆన్‌లైన్ షాపింగ్‌పై నమ్మకం లేకపోవడం, లేదా డెలివరీ సమస్యల భయం ఉండేది. నాప్టోల్ ఈ సమస్యను టీవీ షాపింగ్‌తో అధిగమించింది. టీవీ ఛానెల్స్‌లో నాప్టోల్ యాడ్స్.. గృహోపకరణాలు, ఫ్యాషన్, గాడ్జెట్స్, ఫిట్‌నెస్ పరికరాలు చూపిస్తూ, కస్టమర్లను ఫోన్ కాల్స్ లేదా వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేయమని ప్రోత్సహించేది. ఈ యాడ్స్‌లో ఉత్పత్తులను ఆకర్షణీయంగా చూపించడం, ‘ఇప్పుడే కాల్ చేయండి, డిస్కౌంట్ పొందండి’ లాంటి ఆఫర్లు, మహిళలను, మధ్యతరగతి కుటుంబాలను ఆకర్షించాయి.


అదీకాకుండా తెలుగు, తమిళం లాంటి స్థానిక భాషల్లో యాడ్స్ రావడం, త్వరగా కస్టమర్ సర్వీస్ అందించడం. నాప్టోల్ వెబ్‌సైట్, యాప్‌లో కూడా సులభమైన ఇంటర్‌ఫేస్, క్యాష్-ఆన్-డెలివరీ ఆప్షన్ ఉండటం వల్ల, ఆన్‌లైన్ షాపింగ్‌‌లో కొత్తవారు కూడా కొనేవారు. అలా 2015 నాటికి, నాప్టోల్ 50 లక్షల కస్టమర్ బేస్‌ను సాధించింది. 


ఇక్కడే నాప్టోల్ ఇండియన్స్ సైకాలజీ మీద ఒక స్ట్రాటజీని ఉపయోగించింది. నాప్టోల్ కిచెన్ అప్లయెన్సెస్, హోమ్ డెకర్, ఫ్యాషన్ జ్యూయలరీ, ఫిట్‌నెస్ గాడ్జెట్స్ లాంటి వివిధ కేటగిరీలతో బడ్జెట్-ఫ్రెండ్లీ ఉత్పత్తులను అందించింది.  నాప్టోల్ టీవీ ఛానెల్స్‌లో 24/7 షాపింగ్ షోలను నడిపింది, ఇవి ఉత్పత్తులను డెమో చేసి, కస్టమర్లలో నమ్మకాన్ని పెంచాయి. ఈ షోలు గ్రామీణ ప్రాంతాల్లో, ఇంటర్నెట్ లేని చోట కూడా నాప్టోల్ బ్రాండ్‌ను పాపులర్ చేశాయి. 


ఈ సమయంలోనే నాప్టోల్‌కు ప్రజల నుంచి విమర్శలు కూడా వచ్చాయి. నాప్టోల్ యాడ్స్ ఉత్పత్తుల సామర్థ్యాన్ని అతిశయోక్తిగా చూపించేవి. యాడ్స్‌లో ఆకర్షణీయంగా కనిపించిన ఉత్పత్తులు డెలివరీ అయిన తర్వాత తక్కువ నాణ్యతతో ఉండేవి. ఆర్డర్ చేసిన ఉత్పత్తులు ఆలస్యంగా రావడం, రాంగ్ ఐటెమ్ డెలివరీ అవ్వడం. రిఫండ్ ప్రాసెస్ సమయంలో ఆలస్యం వల్ల కస్టమర్లు నిరాశకు గురయ్యారు. కొంతమంది కస్టమర్లు నాప్టోల్ వెబ్‌సైట్‌లో ఆర్డర్ చేసిన తర్వాత, వారి బ్యాంక్ ఖాతా వివరాలు హ్యాక్ చేసి, కొంతమంది సైబర్ మోసాలకు పాల్పడేవారు. 


ఇలా 2019-2021 మధ్య, డిపార్ట్‌మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్‌కు 6,000కి పైగా మోసపూరిత యాడ్స్ ఫిర్యాదులు వచ్చాయి, వీటిలో నాప్టోల్ యాడ్స్ కూడా ఉన్నాయి. నాప్టోల్ పై అనేక కోర్టు కేసులు దాఖలయ్యాయి, ప్రధానంగా మోసపూరిత యాడ్స్, తక్కువ క్వాలిటీ ఉత్పత్తులు, కస్టమర్ ఫిర్యాదులే ఎక్కువ.


చాలా మంది కస్టమర్లు కన్స్యూమర్ ఫోరమ్‌లలో నాప్టోల్ పై కేసులు వేశారు. ఉదాహరణకు, ఒక కస్టమర్ ఆర్డర్ చేసిన హ్యాండ్‌బ్యాగ్‌కు బదులు తక్కువ నాణ్యత ఉత్పత్తి రావడంతో, రిఫండ్ కోసం కన్స్యూమర్ కోర్టును ఆశ్రయించాడు. ఇలాంటి కేసులు నాప్టోల్ రిప్యూటేషన్‌ను దెబ్బతీశాయి. ఆడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 2020-2022 మధ్య 300కి పైగా మోసపూరిత యాడ్స్‌ను గుర్తించింది. వీటిలో నాప్టోల్ యాడ్స్ కూడా ఉన్నాయి.


ఒకవైపు నాప్టోల్ ఈ సమస్యలను ఎదుర్కుంటుంటే.. మరోవైపు భారత్‌లో ఇంటర్నెట్, ఆన్‌లైన్ షాపింగ్ బాగా పాపులర్ అయింది.  దీంతో నాప్టోల్ ఈ పోటీని తట్టుకోలేకపోయింది.  అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, జియోమార్ట్ లాంటి దిగ్గజాలు గ్రామీణ మార్కెట్‌లో కూడా విస్తరించడంతో, నాప్టోల్ తన ప్రత్యేకతను కోల్పోయింది. దీని టీవీ షాపింగ్ ఛానెల్ ఇప్పటికీ కొంత ఆదరణ కలిగి ఉన్నప్పటికీ, ఆన్‌లైన్ షాపింగ్‌లో దాని షేర్ గణనీయంగా తగ్గింది. 


ఇప్పటికీ నాప్టోల్ పూర్తిగా పతనం కాలేదు. కానీ దాని గత వైభవం కోల్పోయింది. ఇ-కామర్స్ మార్కెట్‌లో రాణించాలంటే, నాప్టోల్ తన ఉత్పత్తి క్వాలిటీని మెరుగుపరచడం, టెక్నాలజీని అప్‌డేట్ చేయడం, కస్టమర్ ట్రస్ట్‌ను తిరిగి పొందాల్సి ఉంది. 


నాప్టోల్ కేవలం ఒక ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫాం కాదు. ఇది ఒకప్పుడు మధ్యతరగతి కలలను అర్థం చేసుకున్న ఒక బ్రాండ్. 2008లో ఒక చిన్న ఆలోచనగా మొదలై.. టీవీ షాపింగ్, సరసమైన ధరలు, స్థానికీకరణ వంటి తెలివైన వ్యూహాలతో ఇండియాలో తనదైన ముద్ర వేసింది. కానీ, తక్కువ క్వాలిటీ ఉత్పత్తులు, మోసపూరిత యాడ్స్, డెలివరీ సమస్యలు, తీవ్రమైన పోటీ వల్ల నాప్టోల్ తన గత వైభవాన్ని కోల్పోయింది. ప్రజల వ్యతిరేకత, మోసాల ఆరోపణలు దాని విశ్వసనీయతను దెబ్బతీశాయి. 


కస్టమర్ నమ్మకం, క్వాలిటీ లేకపోతే, ఎంత పెద్ద బ్రాండ్ అయినా క్షీణించాల్సిందే అనడానికి నాప్టోల్ ఒక చక్కటి ఉదాహరణ అని చెప్పొచ్చు. 


మరి మీరు చిన్నప్పుడు ఈ నాప్టోల్ వస్తువులను కొన్నారో లేదో కామెంట్ చేయండి


Comments

Popular posts from this blog