హనుమంతుడు తెచ్చిన సంజీవని పర్వతం ఇప్పుడు ఎక్కడ ఉంది?



రామాయణం అంటే మనందరికీ తెలిసిన పురాణ గాధ. శ్రీరాముడు, సీత, లక్ష్మణులు వనవాసంలో ఉన్నప్పుడు రావణుడు సీతను అపహరించాడు. ఆమెను రక్షించేందుకు రాముడు వానరసేన సహాయంతో లంక మీద యుద్ధానికి వెళ్లాడు. ఆ యుద్ధంలో లక్ష్మణుడు కుంభకర్ణుడి కుమారుడు ఇంద్రజిత్తు చేతిలో తీవ్రంగా గాయపడ్డాడు. లక్ష్మణుడిని కాపాడేందుకు ఒక ప్రత్యేకమైన మూలిక అవసరమైంది. ఆ మూలిక పేరే సంజీవని. ఇది హిమాలయాల్లో మాత్రమే దొరుకుతుందని తెలియడంతో హనుమంతుడు హిమాలయాలకు వెళ్లి, అక్కడ ఏది సంజీవనో తెలియక మొత్తం కొండనే తీసుకుని వచ్చేశాడు. ఆ మూలికల ద్వారా లక్ష్మణుడు ప్రాణం దక్కించుకున్నాడు. ఇదంతా మనకు తెలిసిన స్టోరీ. 


మరి లక్ష్మణుడు బతికి తర్వాత హనుమంతుడు సంజీవని కొండను తిరిగి హిమాలయాలకు తీసుకెళ్లాడా? లేక ఎక్కడన్న వదిలేశాడా? అనే విషయంపై అనేక నమ్మకాలు, భౌగోళిక పరిశోధనలు, పురాణ గాధలు, ఆసక్తికరమైన ఊహాగానాలు ఉన్నాయి. 


కొన్ని కథల ప్రకారం, మూలిక ఉపయోగించిన తర్వాత, హనుమంతుడు ఆ కొండను తిరిగి హిమాలయాల్లో ఉంచేశాడట. మరికొన్ని కథల ప్రకారం.. హనుమంతుడు కొండను తిరిగి హిమాలయాలకు తీసుకెళ్లలేదు. ఆయన దానిని ముక్కలు చేసి కొన్ని చోట్ల వదిలేశాడనే నమ్మకాలు ఉన్నాయి. ఆ వదిలిన చోట్లనే, ఇప్పటికీ సంజీవని మూలికలు లభిస్తున్నాయని, వాటికి ప్రత్యేక వైద్య గుణాలు ఉన్నాయని చెబుతున్నారు. 


దక్షిణ భారతదేశంలో.. ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా వంటి ప్రాంతాల్లో హనుమంతుడు సంజీవని కొండ నుంచి కొన్ని మొక్కలు పడిపోయినట్లు చెబుతున్న కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. తమిళనాడులోని రామేశ్వరంలోని కొంత భాగం, కర్ణాటకలోని కుట్టకల్ కొండ, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఆయుర్వేద మూలికలు ఎక్కువగా ఉన్నాయని రుజువైంది. శాస్త్రీయంగా పరిశీలించినా, కొన్ని కొండల మీద వైద్య గుణాలతో నిండిన అరుదైన మూలికలు పెరుగుతున్నాయి. ఇక్కడ ముఖ్యంగా ఉత్తరాఖండ్ ప్రాంతంలో ద్రోణగిరి పర్వతం గురించి చెప్పుకోవచ్చు. ఇక్కడి ప్రజలు ఇప్పటికీ సంజీవని మూలికల గురించి కథలుగా చెబుతూనే ఉంటారు.


కొన్ని ఇతిహాసాలు ప్రకారం.. సంజీవని కొండను శ్రీలంకలో ఎక్కడో వదిలేశారని కూడా చెబుతారు. శ్రీలంకలోని రుమాస్‌ఎలా పర్వతాన్ని కొందరు సంజీవని కొండగా భావిస్తారు. అక్కడ కూడా ప్రత్యేకమైన మూలికలు లభిస్తున్నట్లు అక్కడి ప్రజలు చెబుతారు. శాస్త్రవేత్తలు రుమాస్‌ఎలా ప్రాంతాన్ని పరిశీలించినప్పుడు, అక్కడ అరుదైన మూలికలు పెరుగుతున్నాయని, ఇవి ఆయుర్వేద వైద్యంలో ప్రత్యేక స్థానం కలిగి ఉన్నాయని కనిగొన్నారు. ఇది నిజంగా సంజీవని కొండ ముక్కేనా? లేదా సహజసిద్ధమైన వాతావరణ ప్రభావం వల్ల పెరిగిన మూలికలా అన్న దానిపై సరైన క్లారిటీ ఇవ్వలేదు.


మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కొన్ని హిమాలయ ప్రాంతాల్లో ఇప్పటికీ సంజీవని మూలిక గురించి పరిశోధనలు జరుగుతున్నాయి. ఆయుర్వేద నిపుణులు, శాస్త్రవేత్తలు కొన్నాళ్లుగా పరిశోధనలు చేస్తూ వస్తున్నారు. కొందరు శాస్త్రవేత్తలు హిమాలయాల్లో కొన్ని మూలికలను కనుగొని, అవి మనిషి ఆయుష్షును పొడిగించగలవని చెబుతున్నారు. కానీ, పురాణ గాధల్లో చెప్పినట్లు శరీరానికి తక్షణ ప్రభావాన్ని కలిగించే సంజీవని మూలిక ఇప్పటివరకు కనుగొనబడలేదు.


ఇక మరో నమ్మకాన్ని పరిశీలిస్తే, హనుమంతుడు సంజీవని కొండను ముక్కలుగా వదిలేశాడని చెబుతారు. కొన్ని ప్రాంతాల్లో హనుమంతుడు కొండను మోస్తూ వెళ్లిన దారిలో కొన్ని భాగాలు పడిపోయాయని, అందువల్ల ఆయా ప్రదేశాల్లో అరుదైన మూలికలు పెరిగినట్లు చెబుతారు. ఈ నేపథ్యంలో, భారత్‌లోని మరికొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, కేరళ వంటి రాష్ట్రాల్లో కొన్ని కొండలు సంజీవని మూలికలతో సమృద్ధిగా ఉన్నాయని చెబుతారు. వీటిని పరిశీలించినప్పుడు, ఆయుర్వేద ప్రయోజనాలు కలిగిన అనేక మూలికలు లభిస్తున్నాయి. కానీ అవి నిజంగా హనుమంతుడు మోసుకువచ్చిన కొండ భాగాలా? కాదా? అన్నది నిర్ధారించలేని విషయం.



ఇదిలా ఉండగా, పురాతన గ్రంథాలను పరిశీలించినా, సంజీవని మూలిక గురించి చెప్పిన వర్ణనలతో, ఇవాళ ఉన్న కొన్ని మూలికలను పోల్చినప్పుడు కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి. కొన్ని మూలికలకు నిజంగా శరీరానికి మేలుచేసే గుణాలున్నాయి. కానీ పురాణ గాథల ప్రకారం చెప్పినట్టుగా, మనిషిని బతికించే శక్తి ఉందా?లేదా? అన్నది ఇప్పటికీ అర్థంకాని ప్రశ్న. భారతదేశంలోని ఆయుర్వేద నిపుణులు, పరిశోధకులు ఇప్పటికీ ఈ విషయంలో పరిశోధనలు కొనసాగిస్తున్నారు.


మొత్తానికి హనుమంతుడు తెచ్చిన సంజీవని కొండ ఇప్పుడు ఎక్కడ ఉంది? అన్న ప్రశ్నకు సరైనా ఆధారం చూపించలేకపోయినా? కానీ హిమాలయాల్లో, శ్రీలంకలో, దక్షిణ భారతదేశంలోని కొన్ని కొండల్లో ఇప్పటికీ అరుదైన మూలికలు పెరుగుతున్నాయనే వాస్తవాన్ని మాత్రం కొట్టిపారేయలేం.  ఆ మూలికలు నిజంగానే సంజీవనియేనా? అనే విషయం మాత్రం శాస్త్రవేత్తలు ఇంకా నిర్ధారించలేకపోయారు. 


మరి మనిషిని బతికించగల సంజీవని నిజంగానే ఉందా? లేదా? అన్నదానిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. 


Comments

Popular posts from this blog