సముద్రంలో కనిపించిన వింత జీవి.. ఇది కేజీ రూ.28 వేలు
సముద్రం అంటేనే ఒక మాయా లోకం. చూడటానికి ఎంతో అందంగా కనిపించే సముద్రంలో ఎన్నో అందమైన జీవులు కనిపిస్తాయి. అయితే అందమైన జీవులతోపాటుగా కొన్ని భయంకరమైన జీవులు కూడా కనిపిస్తాయి. అలాంటి ఒక వింత జీవి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం, ఇది యూరప్‌లోని వేల్స్‌లోని బెన్నార్ బీచ్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచిన ఒక సముద్ర జీవి.
వేల్స్‌లోని డైఫ్రిన్ ఆర్డుడ్వీ దగ్గర ఉన్న బెన్నార్ బీచ్‌లో ఒక రోజు షెల్ లాంగ్‌మోర్ అనే మహిళ సముద్ర తీరంలో నడుస్తోంది. ఒడ్డున కొట్టుకొచ్చిన ఒక విచిత్రమైన జీవిని చూసి ఆమె ఒక్కసారిగా ఆగిపోయింది. అది ఏమిటో ఆమెకు అర్థం కాలేదు. దాని ఆకారం, రూపం చూస్తే సముద్రంలోని ఏదో రాక్షస జీవిలా కనిపించింది. పొడవైన, బాతు మెడలాంటి ఆకారంతో, రాళ్లకు అతుక్కుని ఉన్న ఆ జీవులు ఆమెను భయపెట్టాయి. కానీ, ఈ జీవి గురించి తెలిస్తే, అది భయపెట్టే జీవి కాదని, పైగా అదొక అద్భుతమైన, ఖరీదైన సముద్ర సంపద అని తెలుస్తుంది.
సముద్ర నిపుణులు ఈ జీవిని పరిశీలించి, ఇవి Gooseneck Barnacles అని గుర్తించారు. వీటిని బాతు బర్నాకిల్స్ లేదా గూస్ బర్నాకిల్స్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే, ఇవి బాతు మెడలాంటి ఆకారంలో ఉంటాయి. ఈ బర్నాకిల్స్ సముద్రంలో రాళ్లకు, ఓడల అడుగుభాగానికి, లేదా కొట్టుకొచ్చిన కలప మొక్కలకు అతుక్కుని
ఉంటాయి. వీటి శరీరం ఒక పొడవైన, సన్నని కాండంతో, దాని చివర ఒక గుండ్రని షెల్‌తో ఉంటుంది. ఇవి చూడటానికి వింతగా, కొంచెం భయంకరంగా కనిపించినా, ఇవి సముద్రంలో అత్యంత రుచికరమైన, ఖరీదైన ఆహారాల్లో ఒకటి. ఈ బాతుమెడ బర్నాకిల్స్ ధర ఒక కిలో దాదాపు 28,000 రూపాయలు! ఇంత ఖరీదు ఎందుకు అని ఆలోచిస్తున్నారా? దీని వెనక ఒక పెద్ద కథే ఉంది.
స్పెయిన్, పోర్చుగల్‌లో ఈ బర్నాకిల్స్‌ని ‘పెర్సెబ్స్ఝ’ అని పిలుస్తారు. అక్కడి ప్రజలు వీటిని ఒక రుచికరమైన సముద్ర ఆహారంగా తింటారు. స్పెయిన్‌లోని కోస్టా డా మోర్టే అనే ప్రాంతంలో ఈ బర్నాకిల్స్ సముద్రంలోని రాళ్లకు అతుక్కుని ఉంటాయి. కానీ, వీటిని సేకరించడం అంత సులభం కాదు. ఈ ప్రాంతంలో సముద్ర అలలు చాలా బలంగా, ప్రమాదకరంగా ఉంటాయి. నిపుణులైన జాలర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి, ఈ రాళ్ల దగ్గరకు వెళ్లి వీటిని సేకరిస్తారు. ఒక్కోసారి భారీ అలలు వాళ్లను ఢీకొట్టి, రాళ్ల మీదకు విసిరేస్తాయి. ఈ ప్రమాదకరమైన పని వల్లే వీటి ధర ఆకాశాన్ని అంటుతుంది. సేకరించిన బర్నాకిల్స్‌ని స్పెయిన్, పోర్చుగల్ నుండి విదేశాలకు ఎగుమతి చేస్తారు, అక్కడ అవి హై-ఎండ్ రెస్టారెంట్లలో స్పెషల్ డిష్‌గా సర్వ్ చేస్తారు.
వీటి గురించి తెలియక చాలామంది బెన్నార్ బీచ్‌లో వీటిని చూసి భయపడి, వాటి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ ఫోటోలు ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. చాలా మంది ఈ జీవి గురించి తెలుసుకోవాలని ఆసక్తి చూపించారు. కొందరు దీన్ని చూసి భయపడ్డితే, మరికొందరు దీని రుచి, ధర గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయారు. సముద్ర నిపుణులు ఈ జీవి గురించి మరింత సమాచారం ఇవ్వడంతో, ప్రపంచవ్యాప్తంగా ఈ బర్నాకిల్స్ గురించి చర్చ మొదలైంది. సముద్రంలో ఇలాంటి అరుదైన, ఖరీదైన జీవులు ఉన్నాయని తెలుసుకుని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.
ఇలాంటి చిత్ర విచిత్ర జీవులు సముద్ర గర్భంలో ఇంకా జీవిస్తూనే ఉన్నాయి. అవి అప్పుడప్పుడు భూమిపైకి వస్తుంటాయి. అలా బయటకు వచ్చిన ఈ బాతుమెడ బర్నాకిల్స్ వైరల్‌గా మారింది.
Comments
Post a Comment